రేవంత్ ఒక బ్రోకర్..ఆయనను జనం ఐటెం లెక్క చూస్తారు : ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను తెలంగాణ ప్రజలు ఐటెం లెక్క చూస్తారంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో వుండగా తన కింద పనిచేసినప్పుడు తిట్టేవాన్నని గుర్తుచేశారు.
ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చేయాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే డీజీపీకి సైతం ఫిర్యాదులు చేశారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ముప్పు అంటూ ఆయన విమర్శలు చేశారు. రేవంత్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటమ్ సాంగ్ లెక్క చూస్తారంటూ ఎర్రబెల్లి దుయ్యబట్టారు. రేవంత్ చుట్టూ వున్న వాళ్లంతా కిరాయి మనుషులేనని.. కాంగ్రెస్ నేతలు ఎవరూ రారని మంత్రి ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తే బ్రేక్ లేకుండా చేయాలని, ములుగులో చేసి నర్సంపేటలో ఎందుకు చేయలేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. రేవంత్ ఒక బ్రోకర్ అని.. టీడీపీలో వుండగా తన కింద పనిచేసినప్పుడు తిట్టేవాన్నని గుర్తుచేశారు.
ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న రేవంత్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో మోడీ ఆఫీస్‌ను పేల్చాలనే ప్రకటన చేయించాలని మంత్రి ఎర్రబెల్లి సవాల్ విసిరారు. రేవంత్ ఇలాగే మాట్లాడితే ఆయనపై చర్యలు తప్పవని దయాకర్ రావు హెచ్చరించారు. నక్సలైట్ల ఎజెండాలో చంపడాలు వుండవని, వాళ్ల ఎజెండా ప్రజల అభివృద్ధి అని మంత్రి అన్నారు. రేవంత్ వ్యవహారంపై సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీపై దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
ALso REad: ప్రగతి భవన్‌ను పేల్చేయాలంటూ వ్యాఖ్యలు.. రేవంత్‌పై కేఏ పాల్ ఫైర్, చర్యలకు డిమాండ్
అంతకుముందు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కి ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్ రావు, ఎల్.రమణ, తాతా మధు, శంభిపూర్ రాజు, దండె విఠల్ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయం, నివాసాన్ని గ్రైనైడ్స్ పెట్టి పేల్చి వేయాల్సిందిగా కోరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రేవంత్ ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డీజీపీని కోరారు.