ప్రగతి భవన్‌ను పేల్చేయాలంటూ వ్యాఖ్యలు.. రేవంత్‌పై కేఏ పాల్ ఫైర్, చర్యలకు డిమాండ్

ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పిన ఆయన.. పీసీసీ పదవి నుంచి రేవంత్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. 
 

praja shanthi party chief ka paul slams tpcc chief revanth reddy over his remarks on pragathi bhavan

ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అలాగే రేవంత్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం స్పందించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని.. భూ కబ్జాలు చేసి రేవంత్ ఈ స్థాయికి వచ్చారని కేఏ పాల్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని ఆయన విమర్శించారు. రేవంత్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. రేవంత్ ప్రజల కోసం పోరాడటం లేదని, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక జూనియర్ అని దుయ్యబట్టారు. ఈ పదవి నుంచి ఆయనను తొలగించి సీనియర్లకు పీసీసీ పదవి ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు పీసీసీ పదవి ఇవ్వాలని ఆయన సూచించారు. 

ఇదిలావుండగా సీఎం కేసీఆర్‌పైనా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. రూ.500 కోట్లు పెట్టి పాత సచివాలయాన్ని కూల్చేశారని, రూ.610 కోట్లు పెట్టి కొత్త సెక్రటేరియట్ నిర్మించి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం పుట్టినరోజున సెక్రటేరియట్ ప్రారంభించడం సరికాదని.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున కొత్త సెచివాలని ప్రారంభించాలని కేఏ పాల్ సూచించారు. ఇప్పటికే కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐకి ఫిర్యాదు చేశానని ఆయన గుర్తుచేశారు. 

ALso REad: రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై దుమారం.. డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు..

అంతకుముందు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కి ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్‌ రావు, ఎల్‌.రమణ, తాతా మధు, శంభిపూర్‌ రాజు, దండె విఠల్‌ ఉన్నారు. రేవంత్‌ రెడ్డి తన పాదయాత్రలో ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయం, నివాసాన్ని గ్రైనైడ్స్‌ పెట్టి పేల్చి వేయాల్సిందిగా కోరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రేవంత్‌ ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డీజీపీని కోరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios