తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు హామీలను అమలు చేయలేకపోయామని చెప్పారు.
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు హామీలను అమలు చేయలేకపోయామని చెప్పారు. రుణ మాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని.. కొంత వరకు మాత్రమే చేసినట్టుగా తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు జాగ ఉన్న దగ్గర కట్టించామని.. జాగ లేని చోట కట్టించలేకపోయామని అన్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనివి అనేక పనులు చేశామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం పెద్దమడూరులో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌడ సోదరుల అభ్యర్థన మేరకు కల్లు రుచి చూశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడు అని కీర్తించారు. చిన్న కుటుంబంలో పుట్టి.. అతి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి అని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న ఒక శక్తి అన్నారు.
