రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

నిర్మ‌ల్: అంబేద్కర్‌ ఆశయసాధనకు అందరూ కృషిచేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 129వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ లోని మినీ ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి మంత్రి అల్లోల పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ... అంబేడ్కర్ చలువతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయ‌న‌ అడుగుజాడల్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అంబేడ్కర్ చూపిన మార్గమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆదర్శమని.. అదే నేపథ్యంలో ఉద్యమం నడిపారని తెలిపారు. 

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన అంబేద్కర్ అందరికి స్ఫూర్తి ప్రధాతగా నిలిచారన్నారు. అంబేడ్కర్ విధానాలతోనే దళితులకు చట్టసభల్లో అవకాశం దక్కుతోందన్నారు.

మ‌రోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్ర‌జ‌లంద‌రూ లాక్ డౌన్ కు స‌హాక‌రించాల‌ని... ప్రతిఒక్కరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని మంత్రి కోరారు. అందరూ సామాజిక దూరం పాటించాలని మంత్రి ఆలోల్ల సూచించారు.