వరంగల్: ప్రముఖ మిమిక్రీ కళకారుడు, స్వరబ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన గత కొద్ది కాలంగా ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయనకు ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే పేరుంది.

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో గల మట్టెవాడలో ఆయన 1932 డిసెంబర్ 28వ తేదీన శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు జన్మించారు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. 1957లో ఆయన శోభావతితో వివాహమైంది.  వారికి ఇద్దరు కూతుళ్లు లక్ష్మీతులసి,వాసంతి.

సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి నాగయ్య మీద అభిమానం పెంచుకున్నారు. వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. 

ఆయన మిమిక్రీ ప్రస్థానం ఆ విధంగా ప్రారంభమైంది. ఆంధ్ర విద్యాభివర్ధిని) హైస్కూల్లో చదువుతున్నప్పుడు హరి రాధాకృష్ణ మూర్తి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి ఆయన శ్రీకారం చుట్టారు. 

1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు మిగతా లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. దానితో ఆయన ముప్పయి ఇంగ్లీషు సినిమాల్ని తనివిదీరా చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు  పరమానందభరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని కొనియాడారు, 

1953 లో  హనుమకొండలోని జి సి ఎస్ స్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రవెశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. 

ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. శ్రీరాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు లభించింది. ఆయన పేరు మీద ప్రభుత్వం ఓ పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. మూడు విశ్వవిద్యాలయాలకు ఆయన గౌరవ డాక్టరేట్ ను ప్రసాదించాయి.