శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు.

అజాంపురా హరిలాల్ బాగ్‌లోని ఫాతిమా కుటుంబాన్ని శనివారం ఆయన కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ... ఫాతిమా ధైర్యం అందరికీ స్పూర్తిదాయకమని కొనియాడారు.

ఆమె చిన్నప్పటి నుంచి ధైర్యశాలియని... చదువులో ముందుండేవారని అసదుద్దీన్ గుర్తుచేసుకున్నారు. ప్రమాదం నుంచి తాను బయటపడేందుకు అవకాశం వున్నప్పటికీ ఇతరులను కాపాడే క్రమంలో ఫాతిమా అసువులు బాశారని ఆయన ప్రశంసించారు.

ఫాతిమా కుటుంబానికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ కోరారు. కాగా శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.