ప్రతి సందర్భంలోనూ ముస్లింల పక్షానే పోరాడుతూ... వారి సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎప్పుడూ షేర్వాణీ, టోపీ ధరించి విలక్షణమైన ఆహార్యంతో కనిపిస్తారాయన.

మాటల తూటాలతో ప్రత్యర్ధులను ముప్పు తిప్పలు పెట్టే అసదుద్దీన్ ఒవైసీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారిపోయారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ పాతబస్తీలోని ఫతే దర్వాజా చౌరస్తాలో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్లడంతో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అదే సమయంలో అసదుద్దీన్ చార్మినార్ నుంచి మిస్రాజ్‌గంజ్ వైపు వెళుతున్నారు. దీనిని గమనించిన ఆయన వెంటనే కారు దిగి వాహనదారులకు తగు సూచనలు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

అసదుద్దీన్ చర్యను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, రంజాన్ మాసం కావడంతో ఫతే దర్వాజా చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరడంతో అక్కడ ఇరుకుగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు.