ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..
తెలంగాణలోని కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

తెలంగాణలోని కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కొన్ని సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపు భూ ప్రకంపనలు వచ్చినట్లు కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాలకు చెందిన ప్రజలు తెలిపారు. దీంతో తాము ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్టుగా చెప్పారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మూడు మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. మరోవైపు తెలంగాణ సరిహద్దు పంచుకుంటున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా ఒక సెకను పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. ఇక, గతంలో కూడా బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.