హుజురాబాద్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు  మిడ్ మానేరు నిర్వాసితుల ఐక్య వేధిక నాయకులు ప్రకటించారు. 

సిరిసిల్ల: హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీచేయనున్నట్లు మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలు ప్రకటించారు. తమకు న్యాయం చేయాలని ఎన్ని విధాలుగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... అందువల్లే హుజురాబాద్ బరిలో నిలిచినట్లు నిర్వాసితుల ఐక్యవేదిక ప్రకటించింది. 

సిరిసిల్ల జిల్లా వేములవాడలో మిడడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల ఐక్య వేదిక ఆద్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు నల్ల బెలూన్లు ఎగరేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ... హుజురాబాద్ ఉపఎన్నికలో మిడ్ మానేరు ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయిన 12 గ్రామాల నిర్వాసితులు పోటీచేయనున్నట్లు ప్రకటించారు. గ్రామానికి 10మంది చొప్పున పోటీలో నిలవనున్నట్లు తెలిపారు. 

కేవలం నామినేషన్లకే పరిమితం కాకుండా హుజూరాబాద్‌లోనే ఉండి నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఇలా జరగకుండా వుండాలంటే తమకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని నిర్వాసితుల ఐక్యవేదిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు.

read more హుజురాబాద్ ఉప ఎన్నిక: అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్

ఇక ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలో 500 మంది ఆర్యవైశ్యులు పోటీలో నిలవనున్నట్లు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాయింట్ సెక్రటరీ చిదురాల అభిషేక్ ప్రకటించారు. ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడానికి నిరసనగానే తాము పోటీ చేయాలని నిర్ణయించినట్లు అభిషేక్ వెల్లడించారు. 

అలాగే వెయ్యి మందిని హుజురాబాద్ ఉపఎన్నికల బరిలో నిలపనున్నట్లు బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించిన విషయం తెలిసిందే. ఇలా ఉపాధి కోల్పోయిన 7600 మంది ప్రభుత్వానికి హుజురాబాద్ ఉపఎన్నికల ద్వారా సమాదానం చెప్పనున్నట్లు కృష్ణయ్య తెలిపారు. వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లను హుజూరాబాద్ బరిలో దింపుతామని కృష్ణయ్య హెచ్చరించారు. 

 అంతేకాదు ఇటీవల ప్రభుత్వం విధుల నుండి తొలగించిన స్టాఫ్ నర్సులు కూడా నామినేషన్లు వేసే అవకాశం వుందని హెచ్చరించారు. ఇలా ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ లు, స్టాఫ్ నర్సులు హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీకి సిద్దమవగా తాజాగా ఆర్య వైశ్యులు కూడా అదే బాటలో నడవనున్నట్లు ప్రకటించారు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఈ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుకు నిరసన తెలియజేయడానికి హుజురాబాద్ ఉపఎన్నికలను వాడుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ లు, స్టాఫ్ నర్సులు, ఆర్య వైశ్యులు చూస్తున్నారు.