ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సైఫ్ అనే సీనియర్ మీద ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడాన్ని తోటి విద్యార్థులు ఖండించారు. ఈ మేరకు సమ్మె నోటీసులు ఇచ్చారు. 

వరంగల్ : ఎంజీఎం పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన.. అనంతర పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన సైఫ్ అనే సీనియర్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీనియర్ పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ సైఫ్ పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది వైద్య విద్యార్థులు ఎంజీఎం దగ్గర ఆందోళన చేపట్టారు. కేసు విచారణ పూర్తికాకుండానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ మేరకు ఆందోళన చేపట్టి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవలు నిలిపేశారు. అత్యవసర సేవలు మినహా ఓపి, మిగిలిన సేవలను వైద్య విద్యార్థులు బహిష్కరించారు. సైఫ్ కు మద్దతుగా నిలిచిన కొంతమంది విద్యార్థులు ఈ మేరకు సమ్మె నోటీసులను ఎంజీఎం సూపర్డెంట్ కు ఇచ్చారు. అప్పటికప్పుడు సమ్మె నోటీసులు ఇవ్వడం సరికాదని సూపరిటిండెంట్ అంటున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి ఎదుట విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సైఫ్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

కిడ్నీ, గుండె పనితీరు మెరుగు: మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల

పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి అయిన డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం విచారకరమైన విషయమేనని అయితే.. అదే సమయంలో కారకుడిగా భావిస్తున్న సైఫ్ మీద ఇలాంటి అసాధారణమైన కేసులు పెట్టడం సరికాదని వారు అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా కేసులు పెట్టారని.. అలా ఎలా వాటిని పరిగణలోకి తీసుకొని కేసులు నమోదు చేస్తారని పీజీ విద్యార్థులు ప్రశ్నించారు. వృత్తిలో భాగంగా సీనియర్ విద్యార్థులు జూనియర్లను పని విషయాల్లో మందలించడం, గైడ్ చేయడం సహజమేనన్నారు. 

ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదని తెలిపారు. సైఫ్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే, అమ్మాయి ఎస్టి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కావడం.. నిందితుడు మైనార్టీ వర్గీయుడు కావడం ఈ కేసులో కీలక అంశం. అయితే పోలీసులు తెలిపిన వివరాల్లో.. సైఫ్.. కాస్త దూకుడుగానే ఆమెను టార్గెట్ గా వేధించాడని తేలిందని తెలుస్తోంది.