మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన ఊహించని స్థాయిలో ఆదరాభిమానాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో నామినేషన్ వేసేటప్పుడు అవసరమైన డబ్బులను మేదరి సంఘం సభ్యులు తులా భారం ద్వారా ఆయనకు అందించారు. రూపాయి నాణేలతో ఆయనను నిలువెత్తు తూచి అందించారు.  

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మహబూబ్ నగర్‌ జిల్లా కేంద్రంలో అనూహ్య రీతిలో ఆదరణ లభించింది. మేదరి సంఘం సభ్యులు ఆయనపై ఒక కొత్త రూపంలో అభిమానాన్ని ప్రదర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తాము బలపరుస్తామని స్పష్టం చేస్తూ వారు ఆయనను మళ్లీ నామినేషన్ వేసినప్పుడు అవసరమైన ఖర్చు కోసం డబ్బులు అందించారు. ఊరికే కాదు.. తులాభారం ద్వారా ఆయనకు డబ్బులు అందించడం గమనార్హం.

తమ అభిమాన నాయకుడు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ ఖర్చుల కోసం మేదరి సంఘం సభ్యులు డబ్బులు అందించారు. త్రాసులో ఒక వైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కూర్చోబెట్టి మరోవైపు వారు డబ్బులను ఒక గంపలో పోసి తూచారు. ఇలా తులాభారం ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ కోసం అవసరమైన డబ్బులను అందిస్తున్నట్టు మేదరి సంఘం సభ్యులు తెలిపారు. 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బండ్లగేరిలో మేదరి సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊహించని రీతిలో స్వాగతం లభించింది. భారీ క్రేన్ సహాయంతో పూలమాలతో ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను త్రాసులో కూర్చోబెట్టి రూపాయి నాణేలతో ఆయన నిలువెత్తు తూచి డబ్బులు అందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పుడు ఈ డబ్బులే ఖర్చు పెట్టాలని వారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు.

Also Read: జమిలి ఎన్నికలంటే ఏమిటీ? ఈ విధానంతో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఏమున్నాయ్?

తాను ఊహించని స్థాయి లో అభిమానం ప్రదర్శిస్తుండటంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మేదరి సంఘం అభిమానానికి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించు కోవడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, తమ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలు ఇంతలా ఆదరాభిమానాలు ప్రదర్శించడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.