ఎంబీఎస్ జ్యువెలర్స్ యజమాని సుఖేశ్‌ గుప్తా మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 

ఎంబీఎస్ జ్యువెలర్స్ యజమాని సుఖేశ్‌ గుప్తా మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హజరైన సుఖేశ్‌ గుప్తా.. నేడు మరోసారి విచారణను ఎదుర్కొంటున్నారు. బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్స్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)తో ఎంఓయూ కుదుర్చుకున్న లావాదేవీలపై ఈడీ అధికారులు సుఖేశ్‌ గుప్తాను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అలాగే అతడి బ్యాంకు ఖాతాలను కూడ అధికారులు తనిఖీ చేసినట్టుగా సమాచారం.

సుఖేశ్‌ గుప్తా కంపెనీ బంగారు వ్యాపారంలో అవకతవకలకు సంబంధించి ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎంఎంటీసీ నుంచి బంగారం కొనుగోళ్ల విషయంపై కేసు నమోదు చేసిన ఈడీ.. ఎంబీఎస్ జ్యువెలర్స్ యాజమాన్యం ఎంఎంటీసీని రూ. 500 కోట్ల మేర మోసం చేసిందని ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఇందులో ఎంఎంటీసీ ఉద్యోగుల సహకారం కూడా ఉందని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఎంబీఎస్ షోరూమ్‌లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. పలు ఆస్తులను కూడా అటాచ్ చేశారు. 

అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ నోటీసులపై సుఖేశ్‌ గుప్తా.. హైకోర్టులో సవాలు చేశారు. అయితే ఇందుకు సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 22న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే విచారణ పేరుతో సుఖేష్ గుప్తా కుటుంబాన్ని వేధించడానికి వీల్లేదని వ్యాఖ్యా నించింది.