అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం మార్చి 8 నుంచి మహిళా వారోత్సవాలను నిర్వహించనుంది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం మార్చి 8 నుంచి మహిళా వారోత్సవాలను నిర్వహించనుంది. మహిళా శక్తి ప్రాముఖ్యతను, సమాజంలో వారి పాత్రను హైలైట్ చేస్తూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మంత్రి కెటీఆర్ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులు కార్యచరణనను సిద్దం చేశారు. 

ఇందులో భాగంగా అధికారులు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమై వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగనున్నాయి. ఇందుకోసం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి మహిళా వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

మహిళా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు సన్మానాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పొడి చెత్త, వంటగది వ్యర్థాలు, నీటి సంరక్షణను సమర్థవంతంగా నిర్వహించడంలో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్న స్థానిక సంస్థలతో పాటు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళలను గుర్తించి సత్కరిస్తామని చెప్పారు. 

అంతేకాకుండా.. పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగు క్యాంపులు నిర్వహించనున్నారు. ఆరోగ్యం, భద్రత, సాధికారతపై మహిళల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా వడ్డీ రహిత రుణాలు అందించే కార్యక్రమాలను సిద్దం చేయాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. వివిధ శాఖలకు చెందిన సీనియర్ మహిళా అధికారులు, జిల్లా కలెక్టర్లు, మహిళా పోలీసు అధికారులు, న్యాయమూర్తులను ఆహ్వానిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని కార్యక్రమాలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.