ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని మత్తయ్య స్పష్టం చేశాడు. 

స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్‌గా రూ.50లక్షలు ఇస్తానని.. చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి నోట్లకట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు. 

అదే విధంగా ఓట్లుకు కేసు విషయంలో తనకేమీ కాకుండా, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్లిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు.

ఈ మేరకు.. ‘‘నేను చాలాకాలంగా చంద్రబాబుకు తెలుసు. టీడీపీకి అనుకూలంగా పనిచేశాను. పలు సందర్భాలలో చంద్రబాబును కలిశాను. అయితే 2015 మహానాడు సందర్భంగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డి నన్ను కలవాలనుకుంటున్నారని..జిమ్మీబాబు నాకు చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. కీలకమైన విషయం మాట్లాడటానికి వాళ్లిద్దరు నన్ను రమ్మన్నారు. దీంతో హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లాను. జిమ్మీబాబు నన్ను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాడు. మహానాడు జరుగుతుండగానే చంద్రబాబునాయుడిని కలిశాను. అక్కడే ఆయన సమక్షంలోనే రేవంత్‌రెడ్డి నాతో ఈ డీల్‌ మాట్లాడారు. స్టీఫెన్‌సన్‌ టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ఒప్పించే బాధ్యత నాకు అప్పజెప్పారు.

ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే.. స్టీఫెన్‌సన్‌కు రూ.5కోట్లు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.3కోట్లు ఇస్తామని చెప్పమన్నారు. ఈ ఒప్పందం కుదిరిస్తే నాకు రూ.50లక్షలు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్‌ చెప్పాడు. 

డీల్‌కు స్టీఫెన్‌సన్‌ ఒప్పుకుంటే.. ముందుగా రూ.50లక్షలు అడ్వాన్స్ ఇస్తామని చంద్రబాబే చెప్పారు. ఈ విషయంలో నేను వెళ్లి స్టీఫెన్‌సెన్‌తో మాట్లాడాలని నాకు చెప్పారు. అతడిని ఒప్పిస్తే నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నేను వెళ్లి స్టీఫెన్‌సన్‌తో చర్చించాను. వాళ్లిద్దరు ఆఫర్ చేసిన డీల్‌ గురించి స్టీఫెన్‌సన్‌కు చెప్పాను, అయితే తాను రేవంత్‌రెడ్డితో నేరుగా కలుస్తానని స్టీఫెన్‌సన్ నాతో చెప్పారు.

ఈ విషయం రేవంత్‌రెడ్డికి చెప్పాలని సెబాస్టియన్‌కు చెప్పాను. చంద్రబాబు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి డబ్బులతో స్టీఫెన్‌సన్ దగ్గరు వెళ్లారు. ఆ తరువాత రేవంత్‌రెడ్డి నేరుగా వెళ్లి స్టీఫెన్‌సన్‌కు బ్యాగులో డబ్బులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హాండెడ్‌గా అరెస్టు చేశారు. 

రేవంత్‌రెడ్డి అరెస్టు అయిన రెండో రోజు రహస్యంగా బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లాను. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్‌ను కలిశాను. నీకేమీ కాదని ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడకు వెళ్లిపొమ్మని నాకు సూచించారు’’ అని మత్తయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 

ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.