మూడు వీధుల్లో, ముగ్గురు భార్యలు.. నిత్య పెళ్లికొడుకు శివశంకర్ బాబు అరెస్టు.. అతని ఖాతాలో13మంది..
13 మంది మహిళల్ని పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లికొడుకు అడపా శివశంకర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు వీధుల్లో, ముగ్గురు.. భార్యలు అంటూ గతవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ : ప్రేమ, పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి వారిని మోసం చేస్తున్న నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. శివశంకర్ 2 తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. అతనిమీద హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలలో పలు సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన శివశంకర్ బాబు(33)మ్యాట్రిమోనీ ద్వారా యువతులను టార్గెట్ చేస్తాడు. ఆ తర్వాత వారిని ఏదో రకంగా మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటాడు.
ఇలా పెళ్లి చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి వదిలేస్తాడు. ఆ తర్వాత మరో మహిళకు గాలం వేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఒకరో ఇద్దరో కాదు దాదాపు పదమూడు మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల హైదరాబాదులో ఓ యువతిని ఇలాగే పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తనకు అమెరికా ఉద్యోగం వచ్చిందని వెంటనే అక్కడికి వెళ్లాలని భార్యను డబ్బుల కోసం వేధించాడు. భర్త మాటలు నమ్మిన ఆమె అతనికి రూ.32 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత, శివ శంకర్ బాబు మళ్లీ అమెరికా ఊసే ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య.. అతని గురించి ఆరా తీసింది. అప్పటికే అతనికి ఇంకా పెళ్లిళ్లు అయినట్లు గుర్తించింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది.
ఈ మేరకు బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ నిత్య పెళ్ళికొడుకు శివశంకర్ బాబును అరెస్టు చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. అతనిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. పరువు పోతుందనే భయంతో చాలామంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని.. డబ్బుల కోసమే మహిళలను ట్రాప్ చేసి పెళ్ళి చేసుకుంటున్నాడు అని.. మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, జూలై 16న తనపై వచ్చిన ఆరోపణలను శివశంకర్ బాబు ఖండించాడు. ఒకే కాలనీలో మూడు వీధుల్లో, ముగ్గురు భార్యలు.. సెకండ్ మ్యారేజ్ మహిళలే టార్గెట్ అంటూ ఇద్దరు భార్యలు ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనమీద అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అడపా శివశంకర్ బాబు మీడియా ముందుకు వచ్చాడు. గౌరవంగా జీవిస్తున్న తన మీద కొందరు కుట్రపూరితంగా వ్యవహరించారని.. మూడు వీధుల్లో, ముగ్గురు భార్యలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివ శంకర్ బాబు అన్నారు. గుంటూరులోని ఒక లాయర్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.
‘హైదరాబాదులో కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాను. నాకు మామయ్య వరుసయ్యే గల్లా శ్రీనివాస్, గిద్దలూరు ప్రాంతానికి చెందిన గురు శ్రీరంగ శ్రీనివాసులు వ్యాపారాల పేరుతో నా ఆధార్, పాన్ కార్డుల ద్వారా భోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకు రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని యువత వద్ద డబ్బులు తీసుకున్నారు. కంపెనీ పెట్టి మూడు నెలలు గడవక ముందే మూసేశారు. నా అడ్రస్ ఉండడంతో డబ్బులు ఇచ్చినవారు నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. శ్రీరంగ శ్రీనివాస్ కు మహిళల వ్యసనం ఉంది.
అమ్మాయిలను తీసుకురావాలని ఒత్తిడి తీసుకు వచ్చేవాడు. నేను అంగీకరించకపోవడంతో ఇద్దరు మహిళలను ప్రోత్సహించి నాపై తప్పుడు ఆరోపణలు చేయించాడు. నేను నిజంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుంటే మిగతావారు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి కదా?’ అని ప్రశ్నించాడు. తనకు ముందుగానే పెళ్లి అయిందని ఆమెతో చిన్నపాటి మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నానని ఇంకా విడాకులు తీసుకోలేదు అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాను వేరే మహిళతో సహజీవనం చేస్తున్నానని ప్రస్తుతం ఆమె గర్భవతి అని వివరించాడు. అంతేకాదు, తాను ఎక్కడికీ పారిపోలేదని గుంటూరులోనే ఉన్నాను అని తెలిపాడు. తనకు గల్లా శ్రీనివాసులు, శ్రీరంగ శ్రీనివాస్ లతో ప్రాణహాని ఉందని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.