మిర్యాలగుడా: మృత్యువును కౌగళించుకున్న మారుతీ రావు చివరి కోరిక తీరే అవకాశం కనిపించడం లేదు. కూతురు అమృత వర్షిణి భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన మారుతీ రావు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన కూతురు అమృత వర్షిణికి విజ్ఞప్తి చేశాడు.

అమృత వర్షిణిని ఉద్దేశించి అమ్మ దగ్గరికి వెళ్లు అని రాశాడు. కానీ, ఆమె అమ్మ గిరిజ వద్దకు వెళ్లే పరిస్థితి లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. శ్మశానవాటికలో ఆమె తన తండ్రి మారుతీరావును చివరిసారి చూడడానికి ప్రయత్నించింది. అయితే, ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. 

Also Read: మారుతీ రావు రెండు తప్పులు: వాటి మూల్యం... ఇద్దరికి వైధవ్యం!

ప్రణయ్ కుటుంబ సభ్యులతో పాటు అమృత శ్మశానవాటికకు వెళ్లింది. అయితే, మారుతీ రావు కుటుంబ సభ్యులకు ఆమె నుంచి వ్యతిరేకత ఎదురైంది. అమృతా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆమె తండ్రిని చివరిసారి చూడకుండానే వెనుదిరిగింది. ఈ స్థితిలో అమృత వర్షిణి తల్లి వద్దకు వెళ్లే పరిస్థితి ఏ మాత్రం ఉండదనేది తెలిసిపోతూనే ఉన్నది.

మారుతీ రావు హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లోని గదిలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గారెల్లో విషం కలుపుకుని అతను తిన్నాడని తేలింది. తన కూతురు అమృత వర్షిణి దళితుడైన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకోవడం అతని నచ్చలేదు. దీంతో కక్ష కట్టి ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. 

Also Read: మిర్యాలగూడ స్మశాన వాటికలో ఉద్రిక్తత: అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు

ఆ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి బెయిల్ మీద విడుదలయ్యారు. ప్రణయ్ హత్య కేసు ట్రయల్స్ కోర్టులో తుది దశలో ఉన్నాయి. తనకు శిక్ష తప్పదనే భయంతోనే కాకుండా కూతురు తన వద్దకు రావడం లేదనే మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.