రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పెద్దపల్లి ఇటుకబట్టీలో సామూహిక అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో తనమీద అత్యాచారం జరగలేదని అది ప్రచారమేనని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

తమను ఇటుకబట్టీ యజమాని రామిండ్ల భాస్కర్, గుమాస్తా రమణయ్య తిట్టి, కొట్టడంతోనే పారిపోయామని బాధితురాలు తారాబతి తన వాంగ్మూలంలో తెలిపిందని పెద్దపల్లి సీఐ ప్రదీప్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

బాధిత భార్యభర్తలు పూజారి, తారామతిలను రాఘవాపూర్ లో గుర్తించి పట్టుకున్నామని సీఐ తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగిందంటూ వచ్చిన ఆరోపణల మీద రామగుండం ఎస్సై శైలజ సదరు బాధితురాలిని విచారించిందని తెలిపారు. 

కార్మికులను కొట్టిన యజమాని భాస్కర్‌రావు, గుమాస్తా రమణయ్యలపై కేసు నమోదు చేశామన్నారు. దంపతులను వైద్య పరీక్షల నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు.

కాగా,  ఒడిశానుండి ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చిన ఓ వివాహితపై యజమానులు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫిర్యాదు చేస్తారన్న భయంతో ఆమెపై, భర్తపై దాడి చేశారు. తమ అరాచకానికి సాక్ష్యంగా నిలుస్తారని మరో 14మంది కూలీలను నిర్భంధించి దాడి చేశారు. 

దారుణమైన ఈ అరాచక ఘటన గత నెల 24న పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో జరిగింది. ఈ విషయం మీద గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయడంలో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

హెచ్ఆర్సీ తనకు వచ్చిన లేఖను అధికారులు పంపించి దీనిమీద విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. హెచ్‌ఆర్సీ నుంచి అధికారులకు అందిన లేఖలోని వివరాల ప్రకారం.. గౌరెడ్డిపేటలోని ఎల్ఎన్సీ ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత(22)పై ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.