మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్  ని క్యాబినెట్  నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత మర్రిశశిధర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

తన రాజకీయ ప్రత్యర్థి తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మీద కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తీవ్రమయిన ఆరోపణలు చేశారు.

హైద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని అవన్నీ మంత్రి తలసాని ప్రోద్బలంతోనే జరిగాయని ఈ రోజు శశిధర్ రెడ్డి ఆరోపించారు.ఈ అక్రమాల మీద కేసీఆర్ దీనిపై స్పందించాలని, తలసానిని మంత్రిపదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

‘ఈ అక్రమాల మీద నేను చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ విచారణ జరిపించారు. ఆ విచారణలో ఈ అక్రమాలు నిజమని తేలింది.మంత్రి తలసాని ప్రోద్బలం తోనే ఈ అక్రమాలు జరిగాయి.అక్రమాలను ప్రోత్సహించిన తలసానిపై కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి,‘ అని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఐడిహెచ్ కాలనీలో మొదటి దఫా డబల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. గత ఏడాది నవంబర్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ కాలనీ లబ్ధిదారులకు అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో అందించారు.

అయితే, ఈ ఇళ్ల కేటాయింపుల్లో జరిగాయని మాజీ మంత్రి శశిధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

‘అక్రమాలకూ పాల్పడవారిపైనే కాదు ప్రోత్సహించిన తలసాని పైనా చర్యలుండాలి.తలసానిని అరెస్ట్ చేయాలి. ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలి,’ అని అంటూ

మంత్రి అక్రమాలను అడుగడుగునా మేం అడ్డుకుంటామని చెప్పారు.