Margadarsi Case: మార్గదర్శికి తెలంగాణ హైకోర్టులో  ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో ఏపీసీఐడీ సోదాలపై అడ్డుకునేలా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమ వ్యవహారాలు జరిగాయంటూ సంస్థ యాజమాన్యంపై సీఐడీ సోదాలు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. అయితే.. ఆ సోదాలను నిలువరించాలని మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కానీ, తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమ వ్యవహారాల్లో సీఐడీ సోదాలపై అడ్డుకునేలా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని బుధవారం హైకోర్టు తేల్చి చెప్పింది.

అంతకు ముందు.. మార్గదర్శి తరపు న్యాయవాది సీఐడీ సోదాలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జడ్జి ముందు మెన్షన్‌ పిటిషన్ దాఖలు చేశారు . అయితే.. ఆ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయర్‌ గోవిందరెడ్డి తప్పుబట్టారు. నిబంధనలకు విరుద్దంగా బెంచ్‌ ముందు మెన్షన్‌ చేశారన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని న్యాయవాది గోవిందరెడ్డి అన్నారు. దీంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహరంలో ఏపీసీఐడీ సోదాలు అడ్డుకోవాలని ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమ వ్యవహారాల కేసులో మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు విచారించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శైలజా కిరణ్ నివాసంలో శైలజతో పాటు, రామోజీరావును కూడా ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై A1గా రామోజీరావు, A2గా శైలజా కిరణ్‌ అలాగే.. మా­ర్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచీల మేనేజర్లపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.