దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ఉపయోగించుకుని ఎన్డిఏ ప్రభుత్వాన్ని తూర్పారబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. బుధవారం ఉదయం మొదలైన పార్లమెంట్ ఉభయ సభల్లో లోక్ సభ వాయిదా పడగానే పలువురు ఎంపిలు మమతతో కలిసి పార్లమెంట్ భవన్ నుండి రాష్ట్రపతి భవన్ వరకూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. చెలామణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయల నోట్లను ప్రధానమంత్రి నరేంద్రమోడి రద్దు చేయటంతో జాతీయ స్ధాయిలో మొదలైన కలకలాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళే ఉద్దేశ్యంతోనే ప్రతిపక్షాలు ర్యాలీని నిర్వహించాయి.
ర్యాలీ నిర్వహించేందుకు మమత గడచిన మూడు రోజులుగా ప్రతిపక్షాలన్నింటితోనూ మంతనాలు జరుపుతున్నారు. దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ఉపయోగించుకుని ఎన్డిఏ ప్రభుత్వాన్ని తూర్పారబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. దేశంలో నెలకొన్న పరిస్ధితులను దృష్టిలో పెట్టుకున్న ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి తన బద్ద శతృవైన సిపిఎంతో కూడా చేతులు కలపటంతో విపక్షాలకు మంచి ఊపు వచ్చింది. దాంతో బుధవారం మధ్యాహ్నం భారీ బందోబస్తు నడుమ మమతబెనర్జీ ప్రతిపక్షాలకు చెందిన నేతలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.
