మణిపూర్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారి తరలింపు ప్రక్రియను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
మణిపూర్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారి తరలింపు ప్రక్రియను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే అక్కడి నుంచి తెలుగువారితో కూడిన తొలి ఫ్లైట్ ఈరోజు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అందులో తెలంగాణతో పాటు, ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులకు కూడా సిద్దం చేశాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తెలంగాణ విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు విమానంలో 214 మంది విద్యార్థులు వచ్చారని.. అందులో ఏపీకి చెందిన 108 మంది, తెలంగాణకు చెందిన 106 మంది ఉన్నారని చెప్పారు. ఇంకో రెండు ఫ్లైట్స్ కోల్‌కత్తా నుంచి రావాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేరుస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు, తాము కృషి చేస్తున్నామని చెప్పారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తెలంగాణ విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. తాము కూడా ఇబ్బంది పడ్డామని తెలిపారు. అయితే తెలంగాణ అధికారులు అద్భుతంగా స్పందించారని.. పెద్దస్థాయి అధికారులైనా తమకు ధైర్యం చెబుతూ చాలా బాగా మాట్లాడారని చెప్పారు.
