హైదరాబాద్: బీజేపీలో విజయశాంతి ఎప్పుడు చేరేదీ తెలియదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. పార్టీలో ఎప్పుడూ చేరినా ఆమె ప్రాధాన్యత ఏంటనేది అప్పుడే చెబుతామన్నారు.

మంగళవారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో సూర్యాపేట జిల్లాకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

also read:హరీష్ కు ఊహించని షాకిచ్చిన కేసీఆర్..!.. విజయశాంతి ట్విట్టర్ పోస్ట్..

కాంగ్రెస్ లో కోవర్టులున్నారన్నారు. ఆ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ నేతలకు నమ్మకం లేదన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి పేదలకు న్యాయం చేద్దామని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనలో అవినీతి, నియంతృత్వం రాజ్యమేలుతోందన్నారు.

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి రూ. 200 కోట్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

హుజూర్ నగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని ఆయన ఆరోపించారు. దుబ్బాక ప్రజలకు ముఖం చూపలేదన్నారు.అబద్దం చెబితే మెడ నరుక్కొంటానని చెప్పిన కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకొందన్నారు. దుబ్బాక ప్రజలకు ముఖం చూపలేదని ఆయన విమర్శించారు.