విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటారని స్పష్టం చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్. బుధవారం విజయశాంతితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అంటే ఎంతో గౌరవమన్నారు.

కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని అంతే తప్పించి పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమేనని కుసుమ కుమార్ వెల్లడించారు. విజయశాంతిని తామంతా ఎంతో గౌరవిస్తామని.. కరోనా కారణంగానే కొత్త ఇన్‌ఛార్జ్‌ను కలవలేకపోయినట్లు ఆయన చెప్పారు.

కాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురూ చర్చలు జరిపారు.

Also Read:కిషన్ రెడ్డి చర్చలు: కాంగ్రెసుకు గుడ్ బై, బిజెపిలోకి విజయశాంతి జంప్?

పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహిస్తోన్న ఆమె తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం, చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డితో భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

పాతగూటికి రావాలని, బీజేపీలోకి వస్తే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని విజయశాంతిని కిషన్‌రెడ్డి ఆహ్వానించారని, తనకు కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారనే ప్రచారం జరుగుతోంది.