హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ నియామకం అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. టీపీసీసీకి కొత్త చీఫ్ ను త్వరగా నియమించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు  పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ను కోరారు.నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాగూర్ ఇవాళ  హైద్రాబాద్ కు వచ్చారు.హైద్రాబాద్ కు వచ్చిన ఠాగూర్ తో  కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నాడు సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ నియామకం గురించి చర్చించారు.  పీసీసీ చీఫ్ నియామాకాన్ని ఆలస్యం చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని  కాంగ్రెస్ నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తైన నాలుగైదు రోజుల్లో సోనియాగాంధీకి నివేదిక అందించనున్నట్టుగా ఠాగూర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వరకు పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకాన్ని నిలిపివేయాలని జానారెడ్డి కోరారు. ఈ వినతి మేరకు ఈ విషయాన్ని ఎన్నికల వరకు నిలిపివేసింది పార్టీ అధిష్టానం.ఈ నెల 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఉపఎన్నికలు పూర్తైన తర్వాత ఠాగూర్ నివేదిక ఇవ్వగానే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందా ఇంకా కొంత కాలం వేచి చూడాలా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

టీపీసీసీ చీఫ్ రేసులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా విన్పిస్తోంది.  జీవన్ రెడ్డితో పాటు  రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి తదితరుల పేర్లు కూడ పీసీసీ రేసులో ఉన్నట్టుగా విన్పించాయి. అయితే జీవన్ రెడ్డి వైపే  పార్టీ నాయకత్వం మొగ్గుచూపుతోందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో  ఉంది.