ఆమెనెందుకు బహిష్కరించలేదు: మహేష్ కత్తి బహిష్కరణపై మందకృష్ణ

First Published 11, Jul 2018, 3:12 PM IST
Manda Krishna condemns ban on Mahesh Kathi
Highlights

సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై నగర బహిష్కరణ విధించడాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఖండించారు. రచయిత్రి రంగనాయకమ్మ రామాయణాన్ని విమర్శిస్తూ పుస్తకాలు రాశారని, ఆమెపై బహిష్కరణ ఎందుకు విధించలేదని ప్రశ్నించారు.

హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై నగర బహిష్కరణ విధించడాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఖండించారు. దళితుడు కాబట్టే మహేష్ కత్తిపై బహిష్కరణ వేటు వేశారని ఆయన విమర్శించారు. 

మహేశ్‌ విషయంలో తెలంగాణ డీజీపీ నిర్ణయం నగర బహిష్కరణలా లేదని, కుల బహిష్కరణ మాదిరిగా ఉందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వేరొకరి మనోభావాలను కించపరచడం తప్పేనని, అయితే ఆ తప్పును దళితులు చేస్తేనే నేరంలా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. 

అగ్రవర్ణాలు చేస్తే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.  స్వామి షిర్డీ సాయిబాబాను, మదర్‌థెరిసాను పరిపూర్ణానంద నిందించలేదా అని అడిగారు. అప్పుడు డీజీపీకి బహిష్కరణ చట్టం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ నిత్యం ఇతరుల మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని అన్నారు. 

రచయిత్రి రంగనాయకమ్మ రామాయణాన్ని విమర్శిస్తూ పుస్తకాలు రాశారని అంటూ ఆమెపై బహిష్కరణ ఎందుకు విధించలేదని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, డీజీపీలను కలిసి మహేశ్‌పై బహిష్కరణ ఎత్తివేయాల్సిందిగా కోరతామని టీఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌ అన్నారు.
 
కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ అప్రజాస్వామికమని విరసం నేతలు వరవరరావు, కల్యాణరావు తదితరులు అన్నారు. పోలీసు యంత్రాంగం హేతువాద భావాలున్న రచయితను బహిష్కరించడం అన్యాయమని, దీన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ, కులవివక్ష పోరాట సంఘం సభ్యులు అన్నారు.

loader