ఓ  ప్రభుత్వ ఉద్యోగినిని హైదరాబాద్ కు బదిలీ చేయిస్తానని నమ్మించి అత్యాచారం చేసి మూడేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్న దారుణ ఘటన అదిలాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ ఫర్ కోసం ఆశపడిన ఆ ప్రభుత్వ ఉద్యోగి అన్నీ కోల్పోయి చివరికి పోలీసుల దగ్గరికి చేరాల్సి వచ్చింది. వివరాల్లోకి వెడితే..

అదిలాబాద్ లో ప్రభుత్యోద్యోగి అయిన ఓ మహిళ భర్తకు హైదరాబాద్ లో ఉద్యోగం. పిల్లలు హైదరాబాద్ లోనే చదువుకుంటున్నాడు. దీంతో తాను కూడా హైదరాబాద్ కి ట్రాన్స్ ఫర్ చేయించుకుని భర్త, పిల్లలతో ఉండాలని బదిలీకోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో మంచిర్యాలకు చెందిన ఓ రియల్ఎస్టేట్ వ్యాపారితో పరిచయం ఏర్పడింది.

తన బదిలీ కోసం బంధువలు ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారైన గాలిపెల్లి చంద్రశేఖర్ ను కలిసింది. అతను తనకు మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసని హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ చేయిస్తానని నమ్మకంగా చెప్పాడు. దానికి కొంత డబ్బు ఖర్చవుతుందని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. 

ట్రాన్స్ ఫర్ కోసమని హైదరాబాద్ లోని తనింటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమె ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బెదిరించి పది లక్షలవరకు నగదు, 35 తులాల బంగారం తీసుకున్నాడు. అయినా ఆగకుండా మూడేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ ఈ నెల మూడో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నిందితుడిని  అదుపులోకి తీసుకున్నారు.