తెలంగాణ మెదక్ జిల్లా హోలీ వేడుకల్లో విషాదంచోటుచేసుకుంది.  హోలీ వేడుకల్లో భాగంగా ఓ వ్యక్తి  మరో వ్యక్తిపై రంగు పోసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

తెలంగాణ మెదక్ జిల్లా హోలీ వేడుకల్లో విషాదంచోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో భాగంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిపై రంగు పోసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ చెలరేగిన గొడవ.. ఒక వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. వివరాలు.. జిల్లాలోని రేగోడ్ మండలం మర్పల్లిలో అంజయ్య తన స్నేహితులు, బంధువులతో కలిసి హోలీ జరుపుకుంటున్నాడు. ఆ సమయంలో బైక్‌పై అటుగా వెళ్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ షబ్బీర్‌పై రంగులు చల్లాడు. ఆ తర్వాత షబ్బీర్ ఆగ్రహంతో అంజయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

ఈ దాడిలో అంజయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడి వారు మంటలను అదుపు చేసి.. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అంజయ్యను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చేర్పించారు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. అంజయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు షబ్బీర్‌కు, బాధితుడు అంజయ్యకు మధ్య పాత కక్షలేవైనా ఉన్నాయా? లేక యాక్సిడెంటల్ గా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.