వారసుడు కావాలని పట్టుబట్టిన ఓ భర్త... భార్యను అతి దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత గుండెపోటుగా చిత్రీకరించాడు. కానీ పోలీసులకు పట్టుబడ్డాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈనెల 10వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలోని వడ్లగూడెం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మౌనిక కేసును పోలీసులు ఛేదించారు. ఆమెది హత్య కేసుగా నమోదు చేశారు. మౌనికను ఆమె భర్త హతమార్చినట్లుగా తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం సిఐ బాలకృష్ణ వెల్లడించారు.
జిల్లాలోని వడ్లగూడెం గ్రామానికి చెందిన చల్ల నాగేంద్రబాబుకు, కల్లూరు కు చెందిన మౌనికతో 11 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి పదేళ్ల కూతురు ఉంది. ఆమె ఒక్కతే సంతానం. కాగా నాగేంద్రబాబుకు వారసుడు కావాలని కోరిక. దీంతో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రంగా జరుగుతున్నాయి.
ఏప్రిల్ 10వ తేదీన కూడా ఇలాంటి గొడవే జరిగింది. ఆరోజు రాత్రి బెడ్రూంలోకి వెళ్లిన తర్వాత వారి మధ్య మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ఆవేశంలో నాగేంద్రబాబు భార్యను తీవ్రంగా కొట్టాడు. చీరతో ఆమెను ఉరివేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి నుంచి ఆమెను కిందికి దించి ఏమీ తెలియనట్టుగా మంచం మీద పడుకోపెట్టాడు. ఆమె గుండెపోటు వచ్చి చనిపోయినట్లుగా నమ్మించడానికి ప్రయత్నించాడు.
దీనిమీద పోలీస్ కేసు నమోదవడంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా అసలు విషయాలు వెలుగు చూశాయి. అయితే, మౌనిక హత్య విషయం నిందితుడి సోదరుడు చల్లా దిలీప్, తండ్రి చల్లా చెన్నారావులకు కూడా తెలుసు. అయినా వారు చెప్పకుండా దాచినందుకు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి మీద కూడా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
