కరెంట్ బిల్లు కట్టమన్నందుకు ఓ విద్యుత్ ఉద్యోగిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడో వినియోగదారుడు. ఈ ఘటన ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో చోటుచేసుకుంది. 

గజ్వేల్ : కరెంట్ బిల్లు కట్టమన్నందుకు విద్యుత్ ఉద్యోగిపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించాడు ఓ వినియోగదారుడు. కేవలం రూ.1200 బిల్లు కోసం లైన్ మెన్ తో గొడవకు దిగిన వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వెల్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... గజ్వెల్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం 2వ వార్డులో సుంకరి కరుణాకర్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. రెండునెలలుగా అతడు కరెంట్ బిల్లు కట్టపోవడంతో జూనియర్ లైన్ మెన్ నరేష్ కట్టాలని కోరాడు. కేవలం రూ.1200 ల బిల్లు మాత్రమే వుందని... త్వరలోనే కడతానని కరుణాకర్ తెలిపాడు. అందుకు విద్యుత్ అధికారి ఒప్పుకోకపోవడంతో ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. 

 విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళిన నరేష్ వారి ఆదేశాలతో కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన కరుణాకర్ తన బైక్ లోంచి పెట్రోల్ తీసి లైన్ మెన్ పై పోసాడు. నిప్పంటించడానికి ప్రయత్నించగా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. 

Read More TSRTC ప్రయాణీకులకు గుడ్ న్యూస్ .. ఆ రూట్‌లలో 10 శాతం రాయితీ.. వివరాలు ఇవిగో..

విద్యుత్ ఉద్యోగి నరేష్ నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై వినియోగదారుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసిన గజ్వెల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లైన్ మెన్ జరిగిన హత్యాయత్నంపై విద్యుత్ శాఖ అధికారులు సీరియస్ గా వున్నారు. కరుణాకర్ కుటుంబసభ్యులు మాత్రం త్వరలోనే బిల్లు కడతామన్నా వినలేదని... దురుసుగా ప్రవర్తించాడని అంటున్నారు.