హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో 12 ఏళ్ల బాలిక సుమేధ నాలాలో పడి మరణించిన ఘటన మరచిపోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని సరూర్‌నగర్ చెరువులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ తపోవన్ కాలనీలో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. బాలాపూర్ ప్రాంతంలోని సుమారు 35 కాలనీల వరద నీరు మినీ ట్యాంక్‌బండ్‌లో కలుస్తోంది.

Also Read:నేరెడ్‌మెట్‌ నాలాలో బాలిక మృతి: జీహెచ్ఎంసీ అధికారులపై తల్లిదండ్రుల ఫిర్యాదు

ఆదివారం భారీ వర్షం కురవడంతో మినీ ట్యాంక్ బండ్‌కు వరద నీరు వెళ్తున్న మార్గంలో తపోవన్ కాలనీ వద్ద ఓ వ్యక్తి కాసేపు నిరీక్షించాడు. ఆ తర్వాత ఒక్కసారిగా స్కూటీని స్టార్ట్ చేసే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి  వాహనంపై నుంచి అదుపు తప్పి వరద నీటిలో పడిపోయాడు.

వరదలో కొట్టుకుపోతోన్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారికి సాధ్యం కాకపోవడంతో వెంటనే డీఆర్ఎఫ్ ‌సిబ్బందికి సమాచారం అందించరారు. ప్రస్తుతం గల్లంతైన వ్యక్తి కోసం సహాయక బృందాలు సరూర్ నగర్ చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.