డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే దారుణంగా కడతేర్చిన భర్త ఉదంతం జగద్గిరి గుట్టలో కలకలం రేపింది. 20వేల విషయంలో కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య జరుగుతున్న గొడవ పెరిగి పెరిగి చివరికి భార్య ప్రాణాలు తీసింది. భర్తను హంతకుడిగా మార్చింది. పిల్లల్ని అనాధల్ని చేసింది.

వివరాల్లోకి వెడితే.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ పరిధి రాజీవ్‌గృహకల్పలో నివాసముంటున్న ముంగమూరి, కృష్ణ, మార్తా భార్యభర్తలు. కృష్ణ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో వీరికి సొంత ఇల్లు ఉంది. దాన్ని ఇటీవలే అమ్మేశారు. ఆ తరువాతే రాజీవ్ గృహకల్పలో కిరాయికి ఉంటున్నారు. 

ఈ గొడవల నేపథ్యంలోనే పిల్లలు ఇబ్రహీంపట్నంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. గొడవల నేపథ్యంలో ఆదివారం రాత్రి కృష్ణ మద్యం తాగి వచ్చాడు. తను ఎన్నిసార్లు అడుగుతున్నా డబ్బులు ఇవ్వడంలేదన్న కక్షతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత సరాసరి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.