ఓ వ్యక్తి చిన్న గొడవకే.. స్నేహితుడిని అతి దారుణంగా హత్య  చేశాడు. ఈ దారుణ సంఘటన వాంబేకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... వాంబేకాలనీలోని ఎఫ్ బ్లాకులో నివాసముంటున్న వేముల రామకృష్ణ(34) సెంట్రింగ్ పనులుచేస్తుంటాడు. కాగా.. విభేదాల కారణంగా భార్యతో విడిపోయాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు కాగా.. ఓ కుమార్తె అనారోగ్యం కారణంగా చనిపోయింది. కాగా.. మిగిలిన కుమార్తె, తల్లితో కలిసి జీవిస్తున్నాడు.

కాగా... సోమవారం ఉదయం తల్లి కూలిపనులకు వెళ్లడంతో.. రామకృష్ణ.. అతని స్నేహితుడు ఆంజనేయులు(24)ని కలవడానికి వెళ్లాడు. అక్కడ వారితోపాటు సునీల్, పండు అనే మరో ఇద్దరు కూడా ఉన్నారు. కాగా.. ఆ సమయంలో రామకృష్ణ, ఆంజనేయులు మధ్య గొడవ జరిగింది. 

ఈ క్రమంలో ఆంజనేయులు పదునైన కత్తితో రామకృష్ణ ఛాతిలో పొడిచాడు. దీంతో.. రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. వీరిద్దరి మధ్య గతంలో పాత గొడవలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.