బీమా డబ్బుల కోసం ఓ వ్యక్తి పిల్లనిచ్చిన మామను హత్య  చేశాడు. దానికి కన్న కూతురే సహకరించడం గమనార్హం. ఈ సంఘటన నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన బిక్నానాయక్(45) తన కుమార్తె బుజ్జిని దామరచర్ల మండలం పుట్టలతండాకు చెందిన భాష్యానాయక్ కు ఇచ్చి పెళ్లి చేశారు. అనంతరం 2015 ఫిబ్రవరిలో బిక్నానాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయారని అప్పట్లో కేసు నమోదైంది.

కాగా.. బీమా డబ్బుల కోసం హత్య కేసులు వెలుగు చూడటంతో పోలీసులు అనుమానం ఉన్న పాతకేసులను తిరగతోడుతున్నారు. ఈ క్రమంలో బిక్నానాయక్ కేసు కూడా తిరిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అల్లుడే.. బిక్నా నాయక్ ని హత్య చేసినట్లు తేలింది. తన భార్య బుజ్జి ని నామినీగా పెట్టి మామ బిక్నా నాయక్ పై పలు పాలసీలు చేయించిన భాష్యా నాయక్.. ఒక రోజు మామకు మద్యం తాగించి అనంతరం హత్య చేశాడు.

ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశాడు. యాక్సిడెంట్ లో చనిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు అలా మూలన పడిపోయింది. కాగా.. బీమా కంపెనీ నుంచి రూ.79.65లక్షలు వారికి అందినట్లు తెలుస్తోంది. నిందితులను తాజాగా.. పోలీసులు అరెస్టు చేశారు.