సూర్యాపేట: భార్యపై అనుమానం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఏకంగా తన తండ్రితోనే భార్య అక్రమసంబంధాన్ని కొనసాగిస్తుందన్న అనుమానం అతడిని మృగంగా మార్చింది. దీంతో కొద్దిరోజుల క్రితమే కన్న తండ్రిని అతి దారుణంగా హతమార్చి జైలుకెళ్లిన దుండగుడు బెయిల్ పై బయటకు వచ్చి భార్యను కూడా గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం జల్మాల్‌కుంట తండాలో  చోటుచేసుకుంది. 

ఈ దారుణ హత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  జల్మాల్ కుంట తండాకు చెందిన నూనావత్ స్వామి, సరోజ భార్యభర్తలు. అయితే తన కన్నతండ్రి నూనావత్ భీక్యా భార్యను లోబర్చుకున్నాడని స్వామి నిత్యం అనుమానించేవాడు. ఈ విషయంలోనే పలుమార్లు భార్యభర్తలు, తండ్రీ కొడుకుల మధ్య వివాదాలు కూడా జరిగేవి. 

read more   రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం: కొడైకెనాల్‌లో తెలంగాణ దంపతులు ఆత్మహత్య

ఆ క్రమంలోనే తండ్రిపై తీవ్రమైన కోపాన్ని పెంచుకున్న స్వామి మూడు నెలల క్రితం తండ్రిని అతి దారుణంగా హతమార్చాడు. అప్పటినుండి జైల్లోనే వున్న ఇతడు ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈసారి తన భార్యను కూడా హతమార్చాలని నిర్ణయించుకున్న అతడు శుక్రవారం అర్థరాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న భార్య సరోజను గొడ్డలితో నరికాడు. తల వెనుకభాగంలో బలమైన గాయం కావడంతో ఆమె మృతిచెందింది. 

ఇలా ఓ దుర్మార్గుడి అనుమానం రెండు నిండు ప్రాణాలు బలితీసుకోవడమే కాదు ముగ్గురు పిల్లలను అనాధలను చేసింది. కన్న తండ్రి, కట్టుకున్న భార్యను చంపిన స్వామి జైలుపాలవగా పాపం వారి ముగ్గురు పిల్లలు అనాధలుగా మారారు.