కొడైకెనాల్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన దంపతులు అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని ఖమ్మం జిల్లా మంగళగూడెనికి చెందిన గోపికృష్ణ దంపతులుగా గుర్తించారు. వీరు 2018లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆర్దిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత ఏడాదిగా కొడైకెనాల్‌లో థెరిస్సా యూనివర్సిటీ సమీపంలో గోపికృష్ణ దంపతులు నివసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ, భద్రాచలం సమీపంలోని చోడవరానికి చెందిన ఏపూరి నందిని 2018లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరిద్దరూ కొడైకెనాల్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. గత రెండు రోజులుగా వీరు ఇంటి నుంచి బయటకు రాలేదని, ఇరుగూ పొరుగూ ఫోన్ చేసినా వీరు లిఫ్ట్ చేయలేదని సమాచారం. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అనుమానంతో వారు వచ్చి చూడగా గోపీకృష్ణ దంపతులు విగతజీవులుగా పడివున్నారు. లాక్‌డౌన్ కారణంగా వీరిద్దరూ ఉద్యోగాలు కోల్పోయారని.. దీంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని సమాచారం. నందిని ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కుదర్లేదని తెలుస్తోంది.

దీంతో ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నారని.. నందినికి అక్కడ ఉద్యోగం వచ్చినా వెళ్లడం కుదరకపోవడంతో, ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇంటికి తిరిగి రాలేక, అటు ఆస్ట్రేలియా వెళ్లలేక, చేతిలో డబ్బులు లేక తీవ్ర మనోవేదనకు గురైన వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు.