భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని రాయితో కొట్టి చంపిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూరు మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌ లో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ కృషన్‌ తెలిపిన వివరాల ప్రకారం విషయం ఇలా ఉంది. 

అమిస్తాన్ పూర్‌ కి చెందిన మల్లేష్, భార్య, ఇద్దరు పిల్లలు. అయితే భార్య అదే గ్రామానికి చెందిన శ్రీహరి(43)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి సంబంధం బయటకు వస్తుందనే కారణంగా శ్రీహరితో కలిసి గోవాకు పారిపోయింది. 

ఈ ఘటన జరిగి పదేళ్లు గడిచింది. మల్లేష్ మరో వివాహం కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలో శ్రీహరి వారం రోజుల క్రితం అమిస్తాపూర్ కు వచ్చాడు. మల్లేష్ కు ఎదుట పడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. తోపులాటలో శ్రీహరి రాయిమీద పడ్డాడు.

ఇదే అదనుగా మల్లేష్ పక్కనే ఉన్న రాయితో శ్రీహరి తలమీద వేశాడు. దీంతో శ్రీహరి అక్కడి కక్కడే మృతి చెందాడు. ఆ తరువాత  మల్లేష్‌ స్వయంగా భూత్పూర్‌ పోలీస్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.