ముసలి తల్లికి సేవలు చేయలేక దారుణానికి ఒడిగట్టాడు ఓ కసాయి కొడుకు. చిన్నప్పుడు పట్టుకు తిరిగిన చీర కొంగుతోనే తల్లిని చంపాడు.
కామారెడ్డి : నవమాసాలు కడుపున మోసి ప్రాణం పోసిన కన్నతల్లినే అతి కిరాతకంగా చంపాడో కసాయి కొడుకు. అల్లారుముద్దుగా పెంచిన తల్లిని వృద్దాప్యంలో అంతే ప్రేమగా చూసుకోవాల్సింది పోయి దారుణానికి ఒడిగట్టాడు. చిన్నపుడు చీర కొంగుపట్టుకుని తిరిగిన వాడు అదే కొంగుతో తల్లిని చంపాడు. మానవ సంబంధాలకే మచ్చలాంటి ఈ అమానుష ఘటన కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ కు చెందిన ఇట్టబోయిన బాలవ్వ(80) వృద్దాప్యంతో పాటు అనారోగ్యానికి గురయి నడవలేని స్థితిలో వుంది. అయితే ఆమెకు సేవలు చేయడం భారంగా బావించాడు కొడుకు చిన్న బాలయ్య. కన్న తల్లి అన్న ప్రేమ లేకున్నా వృద్దురాలన్న కనీస జాలి, దయ చూపించలేదు ఈ కసాయి కొడుకు. తల్లిని అతి దారుణంగా చంపి మృతదేహాన్ని మాయం చేసి తనకేమీ తెలియనట్లు నాటమాడాడు. కానీ అతడి పాపం పండి పోలీసులకు చిక్కాడు.
ఈ నెల 13న(గత గురువారం) రాత్రి తల్లి బాలవ్వ వద్దకు వెళ్ళాడు బాలయ్య. ఆమె నిద్రపోతుండగా చీర కొంగు మెడకు చుట్టి ఊపిరాడకుండా బిగించాడు. దీంతో ఆమె విలవిల్లాడిపోతూ ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతదేహాన్ని అదే రాత్రి గుట్టుగా పూడ్చిపెట్టాడు. ఉదయం తల్లి కనిపించడం లేదంటూ గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసాడు.
Read More మేనల్లుడితో కూతురు లవ్: మంచిర్యాలలో బీరులో మందు కలిపి అల్లుడి హత్య
బాలయ్య మాటలపై అనుమానంతో గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో బాలయ్యను తమ పద్దతిలో విచారించిన పోలీసులు అసలు నిజం రాబట్టారు. తల్లిని తానే చంపానని బాలయ్య ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టాడో చెప్పడంతో రెవెన్యూ, వైద్య అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు పోలీసులు. బాలవ్వ మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.
తల్లిని చంపిన బాలయ్యపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. వృద్దాప్యంలో సేవ చేయాల్సి వస్తుందని కన్న తల్లినే అతి దారుణంగా చంపిన ఈ దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
