మధ్యాహ్నం ఘనంగా చెల్లెలి వివాహం జరిపించాడు. అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఆ తర్వాత పెళ్లికి వచ్చిన బంధువులను దింపి వస్తానని కారులో వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనితోపాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తోగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన బైతి పరశురాములు(38) చెల్లెలి వివాహం గురువారం మధ్యాహ్నం జరిగింది. అతనే స్వయంగా తన చెల్లెలికి కన్యాదానం చేశాడు. తర్వాత సిద్ధిపేట మండలం మందపల్లిలో ఇద్దరు బంధువులను దించేందుకు సాయంత్రం ఇన్నోవా కారులో బయలుదేరాడు. కాగా.. వారు ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో పరశురాములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని చిన్నాన్న కొడుకు బైతి నాగేశ్(22), తమ్ముడి బావమరిది చేర్యాల మండలం కమలాయపల్లికి చెందిన రాగుల అజయ్(30) హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో బంధువు ఐలయ్య గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. పరశురాములు ఒక్కడే వారి కుటుంబానికి ఆధారం. కాగా.. అతని మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుభకార్యం జరిగిన గంటల వ్యవధిలోనే ఇలా చోటుచేసుకోవడంతో ఆ కుటుంబమంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.