కరోనా వైరస్ బారినపడిన వాడు దాని నుంచి కోలుకుంటే అతని సంతోషం మాటల్లో చెప్పలేం. అలాంటిది ఈ మహమ్మారి నుంచి కోలుకుని ఆనందంగా ఇంటికి బయల్దేరిన యువకుడిని మృత్యువు వెంటాడి బలి తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సమీపంలోని ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన గుజ్జరి విజయ్ కుమార్ (17) ఇంటర్ చదువుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అతను హైదరాబాద్‌లో ఉండే మేనమామ వద్దకు వెళ్లాడు.

అక్కడ మెస్‌లో వంట పనులు చేసే మేనమామతో పాటు విజయ్‌కు కరోనా సోకింది. దీంతో ఇద్దరిని అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. రెండ్రోజుల క్రితం నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

శుక్రవారం రాత్రి మామ, అల్లుడు కలిసి మేనమామ సొంతూరు మెదక్ జిల్లా చిన్న శంకరంపేటకు బైక్‌పై బయల్దేరారు. అయితే, మనోహరాబాద్ శివారులో యూటర్న్ తీసుకుంటున్న లారీ ఒక్కసారి బైక్‌ను ఢీకొట్టింది.

మేనమామ ఘటనాస్థలిలోనే మరణించగా... తీవ్రగాయాలపాలైన విజయ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. వీరిద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.