హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల ధనదాహానికి మరో నిండు ప్రాణం బలైంది. మైలార్‌దేవ్‌పల్లిలో శ్రీవారి అనే యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రెండ్రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో అతని తల్లి కోవిడ్‌తో మృతి చెందారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీహరి తన సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. తల్లి వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షల విరాళాలు సేకరించాడు శ్రీహరి. అయితే తల్లి చనిపోయిన తర్వాత డబ్బులు కట్టాలంటూ ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి తెచ్చాయి. ఆసుపత్రి యాజమాన్యం వేధింపుల వల్లే శ్రీహరి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

Also Read:నోటీసులు బేఖాతరు: విరించి ఆసుపత్రిపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర.. ఆంక్షలు విధింపు

కాగా, హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి విరించి హాస్పిటల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కోవిడ్ బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం.. విరించికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇంత వరకు ఆసుపత్రి యాజమాన్యం దీనిపై స్పందించలేదు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ.. విరించి ఆసుపత్రిపై ఆంక్షలు విధించింది. కొత్తగా కరోనా రోగులను చేర్చుకోవద్దని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. అలాగే ప్రస్తుతం చికిత్స పొందుతున్న పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని తన ఆదేశాల్లో పేర్కొంది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తమ ఆదేశాలు అమలు చేయకుంటే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది.