లోన్ యాప్ ఏజంట్ల వేధింపులు: హైద్రాబాద్ లో రాజేష్ సూసైడ్
లోన్ యాప్ వేధింపులు భరించలేక హైద్రాబాద్ నిజాంపేటకు చెందిన రాజేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ లేఖలో కోరారు.
హైదరాబాద్: లోన్ యాప్ వేధింపులకు హైద్రాబాద్ నిజాంపేటలో రాజేష్ అనే వ్యక్తి సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలను ఆయన కోరారు. ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్ సూసైడ్ లెటర్ రాశాడు. లోన్ యాప్ ల వేధింపులు భరించలేక పలువురు గతంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
లోన్ యాప్ వేధింపులకు పాల్పడడంతో కరీంనగర్ జిల్లాకు చెందిన మునిసాయి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రూ. 10 వేలకు గాను అతని నుండి రూ. 45 వేలు వసూలు చేశారు. మునిసాయి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడతామని బెదిరించారు. దీంతో భయంతో అతను పురుగుల మందు తాగి ఈ నెల 24న ఆత్మహత్య చేసుకున్నాడు.
లోన్ యాప్ నుండి లోన్ తీసుకుని సకాలంలో చెల్లించకపోవడంతో న్యూడ్ వీడియోలు పంపుతామని బెదిరింపులకు పాల్పడడంతో రాజమండ్రి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 12న జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.హైద్రాబాద్ జల్ పల్లికి చెందిన కానిస్టేబుల్ లోన్ యాప్ నుండి డబ్బులు తీసుకొని సకాలంలో చెల్లించలేదు. లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడడంతో ఈ ఏడాది జూన్ 20న ఆయన ఆత్మహత్య చేసుకన్నాడు.
ఈ ఏడాది జూలై 12న కృష్ణాజిల్లాలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. తీసుకున్న రూ. 20వేల లోన్ కు ఆమె రూ. 2 లక్షలు చెల్లించింది. ఇంకా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చారు. లేకపోతే నగ్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతామని బెదిరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.