తెలంగాణ సిఎం కేసిఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం కార్యాచరణ సిద్ధం చేస్తుండగా.. ఆయనకు ఊహించని షాక్ తగిలిందా? పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కేసిఆర్ కు కాల్ చేశారా? లేక కేసిఆరే మమతకు కాల్ చేశారా? మమత ఏమన్నారు? కేసిఆర్ ఏమన్నారు? ఈ వ్యవహారంలో అసలు నిజాలేంటి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాలి.

తెలంగాణ సిఎం కేసిఆర్ కాంగ్రేసేతర, బిజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఆ ఫ్రంట్ కు తానే నాయకత్వం వహిస్తానని కూడా చెప్పారు. ఆ ఫ్రంట్ ప్రకటన వెలువడిన వెంటనే వెల్లువలా కేసిఆర్ ప్రయత్నాన్ని స్వాగతిస్తూ జాతీయ నేతలు ప్రకటనలు చేశారని టిఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేసిఆర్ కు ఫోన్ చేశారని, కేసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పినట్లు తెలంగాణలో ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని కేసిఆరే వెల్లడించారు కూడా. అలాగే జార్ఛండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా కేసిఆర్ కు అభినందనలు తెలిపారు. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి కూడా స్వాగతించారు. కేసిఆర్ తో తాము నడుస్తామన్నారు.

కానీ మమతా బెనర్జీ ఫోన్ చేసినట్లు చెబుతున్న వార్తల్లో మాత్రం నిజం లేదని తెలంగాణ జెఎసి అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై తెలంగాణ జెఎసి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. జెఎసి తన వాదనకు ఆధారాలను కూడా తన పేజీలో పొందుపరిచింది. కేసిఆర్ మాటలు అబద్ధాలని ఆ పోస్టులో వెలువరించింది. కేసిఆర్ కు మమత కాల్ చేయలేదని, కేసిఆరే మమతకు కాల్ చేశారని దాని సారాంశం.

తెలంగాణ జెఎసి తన ఫేస్ బుక్ పేజీలో పొందుపర్చిన కథనం ఇది :

మోసపు ప్రచారాలకు పరాకాష్ట...దేశమంతా మద్దతు...థర్డ్ ఫ్రంట్ ప్రకంపనలంటూ వస్తున్న వార్తలు...వాస్తవాలు...
****************************************
థర్డ్ ఫ్రంట్ కు మద్దతుగా కేసీఆర్ కు దేశవ్యాప్తంగా ఫోన్లు...ముఖ్యంగా మమతా బెనర్జీ నుండి కేసీఆర్ కు ఫోన్ అంటూ కోట్లు గుమ్మరించి చేస్తున్న ప్రచారాలు ఎంత అబద్ధాలో జాతీయ పత్రిక "టెలిగ్రాఫ్" లో ప్రచురితమైన ఈ వార్త చూస్తే స్పష్టమవుతుంది...

అసలు మమతాబేనర్జీకి ఫోన్ చేసింది కేసీఆరే...కానీ మమతాబేనర్జీనే ఫోన్ చేసి స్వయంగా మద్దతు ప్రకటించారని మోసపు ప్రచారాలు, బిల్డప్పులూ...
కేసీఆర్ చెప్పిన ఏవిషయాన్నీ మమతాబెనర్జీ పూర్తిగా ఒప్పుకోలేదనే విషయం వార్త పూర్తిగా చదువుతే స్పష్టమవుతుంది...

డబ్బులు గుమ్మరించి ఇలాంటివార్తలు ఇంకా రాపించుకుంటూనే ఉంటారు...ఎల్లుండి అమెరికా అధ్యక్షుడు ట్రంపు, రష్యా అధ్యక్షుడు పుతినూ కూడా ఫోన్ చేశారని వార్తలొస్తే ఆశ్చర్యపోకండి...

తెలంగాణలో ఈమాయమాటలు నమ్మి మోసపోడానికి ఒక్కళ్ళూ సిద్ధంగా లేరు...
#TJAC

పశ్చిమబెంగాల్ లో లీడింగ్ పత్రిక టెలిగ్రాఫ్ లో ఈ వివరాలన్నీ రాయబయడ్డాయి. టెలిగ్రాఫ్ లో ఉన్న కథనం సారాంశం ఏమంటే..? కేసిఆర్ మమతకు కాల్ చేశారు. బిజెపి, కాంగ్రేసేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నాను, తమరు మద్దతివ్వాలని కోరారు. కానీ మమత అంగీకరించలేదు. కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ కు తాము అంగీకరించబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే అని మమత  వెల్లడించారు. అతికొద్దిరోజుల్లో జరగనున్న కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బిజెపిని ఎదురించేందుకు కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ తమ విధానాలు మార్చుకుంటే ఫ్రంట్ లో కలుపుకుందామంటూ కేసిఆర్ ప్రతిపాదించారు. కానీ మమత మాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదట. దీంతో తుదకు మమతా బెనర్జీ వాదనకు కేసిఆర్ అంగీకరించినట్లు టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది.

ఇదీ టెలిగ్రాఫ్ పత్రికలో వచ్చిన కథనం

https://www.telegraphindia.com/india/flexible-mamata-in-touch-with-others-213293

మమతకు కేసిఆర్ కాల్ చేశారని బెంగాల్ పత్రిక రాసింది. మమతా బెనర్జీ స్వయంగా కేసిఆర్ కు కాల్ చేసినట్లు తెలంగాణలోని తెలుగు పత్రికలు రాశాయి. మమత కాంగ్రెస్ ఉండాల్సిందే ఫ్రంట్ లో అన్నది.. కానీ.. అసలు వాస్తవాలు మాత్రం ఎవరికీ తెలియని రహస్యంగానే ఉన్నాయి.