కేసీఆర్ పాలన గాలికొదిలేశారు..: భద్రాచలం వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో భట్టి పర్యటన..
భద్రాచలం వద్ద కరకట్ట పరిసరాలను సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన గాలికొదిలేశారని మండిపడ్డారు.

భద్రాచలం వద్ద కరకట్ట పరిసరాలను సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే పొడెం వీరయ్యతో కలిసి భట్టి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులపై స్థానికులతో మాట్లాడారు. గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ రివ్యూ చేయలేదని, సీఎం కేసీఆర్ కూడా పాలన గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ను దేశమంతా విస్తరించాలనే రాజకీయ ఆలోచన తప్ప ప్రజా సమస్యలు పట్టింపు లేదని విమర్శించారు.
కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్లే మార్గంలో కిన్నెరసాని నది దగ్గర రెండు సంవత్సరాల క్రితమే కట్టిన చెక్ డ్యాం వరద ఉధృతికి తెగిపోయిందని అన్నారు. నాణ్యత లేని పనులు చేసి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్న కెసీఆర్ ప్రభుత్వం చేతకానితననికి ఇదే నిదర్శనమని చెప్పారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి నాణ్యత లేని పనులు చేసిన అన్ని ప్రాజెక్టుల పైన సమగ్ర దర్యాప్తు చేపడతామని అన్నారు. ప్రజా ధనాన్ని వృథా చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తీరుతామని అన్నారు.
తాను రాజకీయం చేయడానికి రాలేదని అన్నారు. ప్రాజెక్టుల వద్ద కరకట్టల నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. వరదలు వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ముంపు గురైందనే వాస్తమనేనని.. అంతా చూస్తున్నదే కదా అని అన్నారు. ప్రజల అవసరాలు ఒదిలిపెట్టి గాలి మాటలు చెబుతుందని.. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తమపై ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.