హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్‌లో ఉన్న మసీదును  ముస్లింల ప్రార్థనల కోసం.. తిరిగి తెరవాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన మైనారిటీ నాయకుడు రషీద్‌ఖాన్‌ సంతకాల సేకరణ చేపట్టడం వివాదానికి దారితీసింది. ఇది ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. 

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్‌లో ఉన్న మసీదును ముస్లింల ప్రార్థనల కోసం.. తిరిగి తెరవాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన మైనారిటీ నాయకుడు రషీద్‌ఖాన్‌ సంతకాల సేకరణ చేపట్టడం వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్‌ గుర్తొచ్చిందా?’’ అని ప్రశ్నించారు. అంతకుముందు నమాజ్‌ ఎందుకు చేయలేదు?. కాంగ్రెస్‌, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కలిసి డ్రామాలాడుతున్నాయి అంటూ విరుచుకుపడ్డారు. భాగ్యలక్ష్మీ దేవాలయం లేదనేవాడు మూర్ఖుడని మండిపడ్డారు. 

చార్మినార్‌ను తొలగించాలని తాము ఎప్పుడూ చెప్పలేదని బండి సంజయ్ అన్నారు. ఓల్డ్ సిటీ న్యూ సిటీగా ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. చార్మినార్ వద్ద బహిరంగ సభ పెట్టి కూడా పాతబస్తీ అభివృద్ది జరగాలని తాము కోరుకున్నామన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంపై చేయి వేయాలని ఆయన సవాల్ విసిరారు. 

Also Read: చార్మినార్‌పై అలా అనలేదు, భాగ్యలక్ష్మి టెంపుల్ పై చేయి వేస్తే ఊరుకోం: బండి సంజయ్ ఫైర్

ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా బండి సంజయ్ ఒక్కడిదా?.. అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని తాము కూడా ఆరాధిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని చెప్పారు. ఎవరో చేసిన పనికి పార్టీది బాధ్యత ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. 

బీజేపీ పాపాల్లో టీఆర్ఎస్ భాగస్వామ్యం కూడా ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో కలిపినప్పుడు... అఖిల పక్షాన్నీ ఎందుకు ఢిల్లీకి తీసుకు వెళ్లలేదని భట్టి ప్రశ్నించారు.