నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని 220 కేవీ సబ్‌స్టేషన్ లో బుధవారంనాడు మంటలు రేగాయి.  సబ్ స్టేషన్ లో ఉన్న భారీ ట్రాన్స్ ఫార్మర్లు పేలడంతో అగ్ని ప్రమాదం వాటిల్లింది. 

సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు వెంటనే  అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. 

భారీగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనో, సబ్ స్టేషన్ పై భారం వల్లో మంటలు చెలరేగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లో భారీగా మంటలు వ్యాపించిన సమయంలో భారీగా శబ్దాలు కూడ విన్పించాయి. 

also read:ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం: 1500 ఇళ్లు అగ్నికి ఆహుతి

జాతీయ రహదారికి పక్కనే ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన వైపు చూస్తూ కొద్దిసేపు రోడ్డుపైనే వాహనాలు నిలిపివేశారు.సకాలంలో ఫైరింజన్లు రావడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అవసరం ఉంటేనే బయటకు రావాలని వాతావరణ నిపుణులు ప్రజలకు సూచించారు. ఇవాళ విద్యుత్ సబ్ స్టేషన్ లో ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనలు చెందారు. అయితే సకాలంలో అధికారులు స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.