తెలుగు సినీ క్రిటిక్ మహేష్ కత్తి తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గిన సూచనలు కనిపించడం లేదు. 

హైదరాబాద్: తెలుగు సినీ క్రిటిక్ మహేష్ కత్తి తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గిన సూచనలు కనిపించడం లేదు. సోమవారం రాత్రి పోలీసుల అదుపులో ఉన్న ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మరో వివాదానికి తెర తీస్తూ వ్యాఖ్య చేశారు. 

పోలీసులు వివరణ కోరుతూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారని, దర్యాప్తుకు సహకరించమని కోరారని కత్తి మహేష్‌ తెలిపారు. ఇకపైన మిగతా విషయాలు చూడాలని ఫేస్‌బుక్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు. 

దాంతో ఆగకుండా మరో వివాదానికి తెర తీస్తూ పోస్టు పెట్టారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన రామాయణంలోని యుద్ధకాండలోని కొంత భాగాన్ని ఆయన పోస్ట్‌ చేశారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని మహేష్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు.

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై హైదరాబద్ నగరంలోని కేబీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌ ఫోన్‌ ఇన్‌లో మాట్లాడారు.