ట్రాఫిక్ ఉల్లంఘనులకు సరికొత్త ‘శిక్ష’ణ మొక్కలు నాటించి కౌన్సెలింగ్ మహబూబ్ నగర్ పోలీసుల వినూత్న యత్నం

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఎక్కడైనా జరిమానా విధించి వదిలేస్తారు పోలీసులు. కానీ, ఈ ప్రయత్నం వల్ల ఉల్లంఘనలు ఎమైనా తగ్గాయా... వాహనదారులు తమ పద్ధతి మార్చుకుంటున్నారా అంటే మొత్తంగా అవును అని చెప్పలేని పరిస్థితి.

ఫైన్ వేయడం వల్ల వాహనదారులు పద్ధతిగా రూల్స్ పాటిస్తారని చెప్పలేం. అందుకే ఇలాంటి సమస్యను పరిష్కరించి ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో మార్పులు తేవడానికి మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు కొత్త ‘ఫైన్’ను వేస్తున్నారు.

ఈ ‘ఫైన్’ వేస్తే వాహనదారులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. తమ బాధ్యతగా ఒక మొక్కను నాటాలి. పచ్చదానాన్ని పరిరక్షించాలి.

ఇలా ట్రాఫిక్ ఉల్లంఘించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారితో రోడ్ల పక్కన మొక్కలు నాటించడం ద్వారా సామాజిక స్పృహ, సేవభావం, బాధ్యతాయుతమైన జీవనం వైపుగా వారిని నడిపించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

మహబూబ్ నగర్ ఎస్పీ రమా రాజేశ్వరి సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈ సరికొత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.