ఫేస్ బుక్ తో కిడ్నీదాతలకు బురిడీ ఆన్ లైన్ మోసగాడి అరెస్టు మహబూబ్ నగర్ పోలీసులకు చిక్కిన కేటుగాడు

మనమంతా టైం పాస్ కోసం ఫేస్ బుక్ వాడుతుంటాం.. వీడు మాత్రం ఫేస్ బుక్ ను మోసం కోసం మాత్రమే వాడుతాడు. ఫేస్ బుక్ ను కాస్త కిడ్నీ బుక్ గా మార్చేశాడు. ఆన్ లైన్ లో కిడ్నీ డోనర్లను ఆకర్షిస్తూ మోసాలకు తెగబడ్డాడు. చివరికి మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసుల చేతికి చిక్కాడు.

అనంతపురం జిల్లా గుంతకల్‌ కు చెందిన హనీఫ్‌షాన్‌ కిడ్నీ డోనర్ల పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్ తెరిచాడు. డాక్టర్ గా చలామణి అవుతూ.. కిడ్నీ డోనర్లు కావాలని ప్రకటనలు అందులో పోస్ట్‌ చేసేవాడు. డబ్బుకు ఆశపడో, అవసరమయ్యో కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారిని సంప్రదించేవాడు. ముందస్తుగా కొన్ని పత్రాలు సిద్ధం చేసుకునేందుకు డబ్బు అవసరమని చెబుతూ తన బ్యాంకు అకౌంట్ లో డబ్బులు వేయాలని చెప్పి తర్వాత రిప్లై ఇవ్వకుండా పరారయ్యేవాడు.

ఇలా మహబూబ్ నగర్ కు చెందిన కిరణ్‌కుమార్‌ ఫేస్‌బుక్‌ ద్వారా హనీఫ్‌షాన్‌ను సంప్రదించాడు. రూ.లక్షల్లో సొమ్ము వస్తుందని చెప్పడంతో తన కిడ్నీని అమ్మేందుకు ఒప్పుకున్నాడు. కుటుంబ సభ్యులను నమ్మించి.. వారిచ్చిన రూ.10 వేలు అతని అకౌంట్ లో వేశాడు.

వైజాగ్‌లోని హనీఫ్‌షాన్‌ దగ్గరకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఈ నెల 24న తిరుపతికి వెళ్లాడు. ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాడు. అందులోని నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులు హనీఫ్‌షాన్‌కు ఫోన్ చేయడంతో కిరణ్‌కుమార్‌ అమ్ముకునే విషయం తెలిసింది.

తమ కుమారుణ్ని క్షేమంగా ఇంటికి పంపించాలని కోరారు. అందుకాయన నగదు డిమాండ్‌ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుణ్ని గుంతకల్‌లో అరెస్టు చేశారు. హనీఫ్‌షాన్‌ డాక్టర్ కాదని, ఇప్పటికే అతడు కిడ్నీల పేరుతో చాలా మందిని మోసం చేసినట్లు తమ విచారణలో తేలిందని, కిరణ్‌కుమార్‌ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడని మహబూబ్ నగర్ పోలీసులు తెలిపారు.