మాదాపూర్ డ్రగ్స్ కేసు: సినీ ఫైనాన్షియర్ వెంకట్ సహా ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్ లోని మాదాపూర్ లో నిర్వహించిన రేవ్ పార్టీని నార్కోటిక్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మాదాపూర్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదాపూర్ లోని విఠల్ రావు నగర్ లో గల ఓ అపార్టుమెంటులో రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న అధికారులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.
కొందరు సినీ ప్రముఖులు కూడా ఆ రేవ్ పార్టీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తులను అధికారులు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సీని ఫైనాన్షియర్ వెంకట్ తో పాటు బాలాజీ, కె. వెంకటేశ్వర రెడ్డి, డి. మురళి, మధుబాల, మేహక్ లను నార్కోటిక్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంకట్ కదలికలపై మూడు నెలలుగా అధికారులు నిఘా పెట్టారు. డ్రగ్స్ మాఫియాతో అతనికి గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో వెంకట్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంకట్ నుంచి ఎల్ఎస్డితో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అదుపులోకి తీసుకున్న బాలాజీపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు కూడా సినీ పరిశ్రమకు సంబంధించినవారే. డ్రగ్స్ పార్టీ గురించి వెంకట్ వాట్సప్ చాట్ చేసినట్లు భావిస్తున్నారు.
డమరుకం, ఆటోనగర్ సూర్య, పూలరంగడు, లవ్ లీ సినిమాలకు వెంకట్ ఫైనాన్స్ చేశాడు. డ్రగ్ పార్టీలో ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ అపార్టుమెంట్ యజమానికి తెలిసే జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.