హైదరాబాద్: వారిద్దరు వరసకు బాబాయ్-కూతురు. ఈ వరసలను పక్కనపెట్టి వారిద్దరు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లికి మాత్రం పెద్దలతో పాటు సమాజం కూడా అంగీకరించదని భావించి దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. కలిసి బ్రతకలేకపోయినా కలిసి చనిపోదామని నిర్ణయించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ శివారుజిల్లా రంగారెడ్డిలో చోటుచేసుకుంది. 

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం సారాపూర్‌ తండాకు  చెందిన నేనావత్‌ రమేశ్‌ (24) అదే  గ్రామానికి చెందిన బంధువుల యువతి ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరు బాబాయ్, కూతురు వరస అవుతారు. దీంతో పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోడానికి సంశయించారు. అలాగని ఎక్కడికయినా వెళ్లి బ్రతికాలని అనుకోలేదు. 

ఇలా ఓవైపు వీరి ప్రేమ సాగుతుండగానే యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థమయ్యింది. దీంతో ఇక తామిద్దరం విడిపోక తప్పదని భావించిన ఈ ప్రేమజంట కలిసి చావాలని నిర్ణయించుకుంది. మంగళవారంరాత్రి ఇద్దరూ పురుగుల మందుతాగారు. దీంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా రమేష్‌ మాత్రం సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. 

read more   తెలంగాణలో ఇసుక మాఫియా: రైతుని లారీతో తొక్కించి దారుణ హత్య

అయితే తర్వాత రోజు యువతిని కొనఊపిరితో గుర్తించిన కుటుంబసభ్యులు హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత చెట్టుకు ఉరేసుకుని వున్న యువకుడి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. అతడు ప్రాణాలు కోల్పోగా యువతి చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యలు  కాకుండా పరువు హత్య ఏమయినా జరిగిందా అన్న అనుమానాలు కూడా వున్నట్లు తెలుస్తోంది.